Why should women wear bangles? స్త్రీలు గాజులు ఎందుకు ధరించాలి?

Why should women wear bangles? స్త్రీలు గాజులు ఎందుకు ధరించాలి?
April 25, 2015 Comments Off on Why should women wear bangles? స్త్రీలు గాజులు ఎందుకు ధరించాలి? Hindu IT Support KCH Jobs
Why should women wear Bangles?

స్త్రీలు గాజులు ఎందుకు ధరించాలి?


చేతికి గాజులందము…చెంపకు సిగ్గులందముఅన్నాడో సినీ కవి. నిజమే…లేత తామరతూడులాంటి కన్నెపిల్ల చేతికి గాజులిచ్చే అందము మరేది ఇవ్వదు. కేవలం అందం కోసమే గాజులయొక్క ప్రయోజనం.. అని అనుకోవడం పొరపాటు. గాజులు..స్త్రీకి రక్షాకంకణం వంటిది. ఈ గాజులు ధరించడం వెనుక సాంప్రదాయబద్ధమైన ఎన్నో ప్రయోజనాలు దాగివున్నాయి. అప్పుడే పుట్టిన పసిబిడ్డలకు దిష్టి తగలకుండా ఉండడానికి నల్లగాజులు వేస్తారు. ఆ పసిబిడ్డ మెలుకువగా ఉన్నప్పుడు చేతులు ఆడిస్తూంటే.. ఆ చేతులకు ఉండే గాజులు..లయబద్ధంగా చేసే చిరుసవ్వడులు..ఆ పసివాణ్ణి పలకరిస్తాయి.

అవి వింటూ..ఆ చిన్నారి ఆడుకుంటాడు. ఇలా ప్రారంభమైన గాజుల ప్రస్థానం..జీవితం చివరి వరకూ కొనసాగుతూనే ఉంటుంది. ప్రాచీనకాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా అందరూ గాజులు ధరించేవారు. వీటిని ధరించడం వల్ల మనకు తెలియకుండానే నడకలో ఒక లాలిత్యం, లయ ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆడపిల్లలకు చాలా చిన్నతనంనుంచే ఈ గాజుల వాడకాన్ని అలవాటు చేస్తారు. జీవితం చాలా విలువైనది..ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. గాజులాగే ఫగిలిపోతుందిఅనే జీవన సత్యాన్ని చిన్నతనం నుంచే తెలిసేలా చెయ్యడం కోసమే.. ఆడపిల్లలకు ఈ గాజులు ధరింపజేసే ఆచారాన్ని అలవాటు చేసారు.

అయితే..ఆడపిల్లకే ఈ జాగ్రత్త అవసరమా..మగవాడికి అవసరం లేదాఅనే సందేహం నేటి ఆధునిక స్త్రీలకు కలగడం తప్పు కాదు. కానీ..ప్రాచీనకాలం నుంచీ, నేటి వరకూ..స్త్రీని గృహలక్ష్మిఅని గౌరవించారేగానీ.. పురుషుని గృహవిష్ణువుఅని గౌరవించిన దాఖలాలు ఎక్కడా లేవు. అందుకే.. ఇల్లాలిని చూసి ఇంటిని చూడమన్నారు…పెద్దలు. మగవాడు..దుబారా మనిషి అయినా.. ఆ ఇంటి ఆడది జాగ్రత్తపరురాలైతే..ఆ ఇంట్లో ఏ లోటు ఉండదు. అందుకే చిన్నతనం నుంచీ ఆడపిల్లకు జాగ్రత్త అలవాటు చెయ్యడం కోసమే..గాజులు వేసేవారు. రెండు చేతుల నిండా గాజులేసుకుని, పట్టుపరికిణీ కట్టుకుని.,సాక్షాత్తు లక్ష్మీదేవిలా..ఆడపిల్ల నట్టింటిలో తిరుగుతూంటే..చూడడానికి శోభాయమానంగా ఉంటుంది కానీ… బోసి చేతులేసుకుని..నడకలో ఓ లాలిత్యం లేకుండా పెద్ద పెద్ద అంగలేస్తూ, రాక్షసిలా ఆడపిల్ల తిరిగితే ఏం బావుంటుంది చెప్పండి. సరే…గాజుల విషయానికొద్దాం. గాజులు అందానికే కాదు.,సౌభాగ్యానికి కూడా చిహ్నం. గాజులు…తమ రంగునుబట్టి రకరకాల అర్థాలను తెలియచేస్తాయి.

ఎరుపురంగు గాజులు శక్తిని, నీలంరంగు గాజులు విఙ్ఞానాన్ని, ఊదారంగు గాజులు స్వేచ్ఛను, ఆకుపచ్చరంగు గాజులు అదృష్టాన్ని, పసుపురంగు గాజులు సంతోషాన్ని, నారింజరంగు గాజులు విజయాన్ని, తెల్లరంగు గాజులు ప్రశాంతతను, నలుపురంగు గాజులు అధికారాన్ని, వెండి గాజులు బలాన్ని, బంగారు గాజులు ఐశ్వర్యాన్ని సూచిస్తాయి. పెళ్లయిన ఆడపిల్ల…కడుపు పండి, పురిటికని పుట్టింటికి వచ్చిన వేళ.. ఐదోనెలలో గాని, ఏడోనెలలో గాని, సీమంతం చేస్తారు.

ఈ కాలంలో తొమ్మిదో నెలలో కూడా చేస్తున్నారనుకోండి. అది వేరే సంగతి. ఈ సీమంతోత్సవంలో..పేరంటానికి వచ్చిన ప్రతి ముత్తయిదువు…ఆ సీమంతవధువు చేతులకు తలో జత మట్టిగాజులు తొడగడం అనాదినుంచి వస్తున్న ఆచారం. ఇలా గాజులు తొడగడం ఎందుకు అంటే… ఐదో నెలలోనే గర్భస్థ పిండానికి ప్రాణం వస్తుంది. అప్పటినుంచి ఆ స్త్రీ మరింత జాగ్రత్తగా ఉండాలి. గాజులేస్తే జాగ్రత్త వస్తుందా.? వస్తుంది. గాజులు ఫగలడాన్ని అమంగళంగా, అశుభంగా భావిస్తారు మన భారత స్త్రీలు. అందుకే గాజులు ఫగలడాన్ని ఇష్టపడరు. గాజులు ఫగలకుండా నడవడం కోసమే.. సీమంతంలో గాజులువేసే సాంప్రదాయాన్ని ప్రతిపాదించింది మన శాస్త్రం.ధనవంతులు రెండు చేతులనిండా ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా..ఒక్కొక్క చేతికి కనీసం రెండేసి మట్టి (గాజు)గాజులు వేసుకోవాలని శాస్త్రం చెప్తోంది. అమ్మవారి పూజల్లో పసుపు, కుంకుమలతోపాటు గాజులను కూడా ఉంచి పూజించడం మన ఆచారం. ముత్తయిదువులకు గాజులిచ్చి గౌరవించే సాంప్రదాయం మనది. ఎంత పేదింటి అన్నయినా..చెల్లెలిని చూడడానికి వచ్చి, తిరిగి వెడుతున్నప్పుడు.. 

ఓ పదో, పరకో చేతిలోపెట్టి..గాజులేయించకోమ్మాఅంటాడు. ఇలా స్త్రీ జీవితంలో గాజులు చోటుచేసుకుని, వారికి అందాన్నిస్తూ, జాగ్రత్తలు నేర్పుతూ, తాము ఫగలకుండా, మన సాంప్రదాయాలు ఫగలకుండా కాపాడుతూ వస్తున్న గాజులను గౌరవిస్తే మన సాంప్రదాయాలను గౌరవించినట్టే.
About The Author